నిజామాబాద్ : ఈ నెల 19 న నిజామాబాద్‌లోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీళ్లలోకి బస్సును తీసుకెళ్లిన డ్రైవర్ పై వేటు పడింది. ఆర్టీసీ డ్రైవర్‌ను(RTC driver) ఉన్నతాధికారుల సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా (Nizamabad)కేంద్రంలో సోమవారం( 19 న) మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. గంటన్నర పాటు పడిన భారీ వర్షానికి ఇందూరు జలమయమైంది. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు నిలిచింది. ఇది గమనించని ఆర్టీసీ డ్రైవర్ ముందుకెళ్లడంతో బస్సు నీళ్లలో చిక్కుకుపోయింది. సగం మేర బస్సు నీటిలో మునిగిపోవ డంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఈత వచ్చినవాళ్లు దూకి బయటకు రాగా, మహిళలు, చిన్నపిల్లలు బస్సులోనే చిక్కుకుపోయారు. స్థానికులు హుటాహుటిన స్పందించి బస్సులోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు చేర్చారు. కమిషనరే ట్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వర్షపునీరు నిలిచిపోయినా గంటకు పైగా ఎవరూ స్పందించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ సాంబయ్యను ఆర్టీసీ అధికారులు సస్పెండ్(Suspend) చేశారు. అయితే మున్సిపల్, రైల్వే తప్పిదాలకు డ్రైవర్‌ను అన్యాయంగా బలి చేశారని విమర్శలు వస్తున్నాయి.