Home Guards | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): హోంగార్డులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న హెల్త్‌కార్డులపై ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే హోంగార్డులకు హెల్త్‌కార్డులు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఏడాదిన్నర గడుస్తున్నా పట్టించుకోవడం లేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హోంగార్డులందరూ ప్రైవేట్ హెల్త్‌కార్డులు తీసుకోవాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. పోలీసులకు కల్పించే ఆరోగ్య భద్రత హోంగార్డులకు వర్తించదు కాబట్టి.. కచ్చితంగా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అధికారులు సందేశాలు పంపుతున్నారని తెలుస్తున్నది.
ఈ మేరకు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెడుతున్నారని హోంగార్డులు వెల్లడిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వం హెల్త్‌కార్డులు ఇస్తుందని ఎదురుచూసిన హోంగారులు.. ఇప్పుడు అధికారుల సందేశాలు చూసి గాబరా పడుతున్నారు. ఇప్పటికే కారుణ్య నియామకాలకు తిలోదాకాలిచ్చిన ప్రభుత్వం హెల్త్‌కార్డులకు కూడా మంగళం పాడినట్టే కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టకుండా హెల్త్‌కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికీ రిటైర్డ్ అయిన ఐపీఎస్ అధికారుల ఇండ్లలో హోంగార్డులతో సేవలు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అకాడమీలో మరీ దారుణంగా మున్సిపల్ వర్కర్ చేసే అన్ని పనులనూ హోంగార్డులతో చేయిస్తున్నారని, ఆ విధానాన్ని తక్షణం ఆపాలని కోరుతున్నారు.