TGSRTC | హైదరాబాద్, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ): నిత్యం నష్టాలు.. నష్టాలు అని చెప్పుకునే టీజీఎస్ ఆర్టీసీ.. ఆదాయాన్ని రాబట్టుకోవడంలో మాత్రం చేతికొచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు టీజీ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపకపోవడంతో మన రాష్ట్రం నుంచి రోజూ వేలాదిమంది భక్తులు సొంత వాహనాలు, ప్రైవేటు బస్సులు, ఏపీ ఆర్టీసీకి చెందిన బస్సుల్లో వెళ్తున్నారు. రాష్ట్రం నుంచి ప్రత్యేక బస్సులు నడిపితే సంస్థకు అధిక ఆదాయం సమకూరేదని పలువురు ఆర్టీసీ ఉద్యోగులే చెబుతున్నారు.
ప్రత్యేక ప్యాకేజీతో బస్సులు నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ
ఏపీఎస్ ఆర్టీసీ కుంభమేళాకు ప్రత్యేక సర్వీసులు నడుపుతుండటంతో మన రాష్ర్టానికి చెందిన భక్తులు ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సులను బుక్‌చేసుకొని వెళ్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీకి రూ. 8000, స్టార్ లైనర్ నాన్-ఏసీ స్లీపర్‌కి రూ. 11,000, వెన్నెల ఏసీ స్లీపర్‌కు రూ. 14,500ల చొప్పున టికెట్ ధరలు ఖరారు చేసి నడుపుతుంది. అలాగే వారణాసి, అయోధ్య వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా 3,600 కిలోమీటర్ల మేర ఎనిమిది రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ అంశంపై టీజీ ఆర్టీసీ అధికారులను వివరణ కోరగా, మన బస్సులు దూర ప్రయాణాలకు పనికిరావని సెలవిచ్చారు.