హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. నోటితో నవ్వుతూ నోసటితో వెక్కిరించేలా వ్యవహరిస్తున్నది. స్వయం సహాయక బృందాల (ఎస్ఎహెచ్జీ) మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని గొప్పలు చెప్తూనే, మరోవైపు వారిని బజారున పడేస్తున్నది. అందులో భాగంగా హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని శిల్పారామం పక్కన ఇందిరా మహిళా శక్తి బజార్లో ఎస్‌హెచ్‌జీ మహిళలు ఏర్పాటు చేసుకున్న స్టాళ్లను అధికారులు ఖాళీ చేయించారు. బాధితులు సమయం కావాలని వేడుకున్నా వినకుండా బలవంతంగా బయటకు పంపించేశారు. శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో మొత్తం 106 స్టాళ్లు ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ నిరుడు డిసెంబర్ 5న ‘మహిళా శక్తి’ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.
రాష్ట్రంలోని ఎస్‌హెచ్‌జీ మహిళల ఆర్థికాభ్యున్నతికి సంపూర్ణ తోడ్పాటు అందిస్తామని, తద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని గొప్పగా చెప్పారు. అందులో భాగంగా ఎస్ఎహెచ్జీ మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఇందిరా మహిళా శక్తి బజార్లో స్టాళ్లు కేటాయించారు. అంతేకాకుండా హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎస్‌హెచ్‌జీ మహిళలు స్టాళ్లను ఏర్పాటుచేసుకొని తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎస్‌హెచ్‌జీ మహిళలు తయారు చేసిన చేనేత, హస్తకళలు, ఇతర ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల కోసం స్టాళ్లను ఏర్పాటు చేయించారు.
ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ శుక్రవారం అకస్మాత్తుగా పరిస్థితి మారిపోయింది. ఇందిరా మహిళా శక్తి బజార్లో ఎస్‌హెచ్‌జీ మహిళలు ఏర్పాటు చేసుకున్న సుమారు పదికిపైగా స్టాళ్లను అధికారులు శుక్రవారం బలవంగా ఖాళీచేయించారు. ఇతర రాష్ర్టాలవారి ఉత్పత్తుల ప్రదర్శన కోసం తెలంగాణ మహిళల స్టాళ్లను తొలగించారు. అక్కడ ఇతర రాష్ర్టాలవారి స్టాళ్లతో ఏర్పాటు చేసిన ‘సరస్ మేళా-2025’ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు.
ఇతర రాష్ట్రాలు, జిల్లాల మహిళలకు సహాయం చేయడానికి తాము వ్యతిరేకం కాదని, అందుకోసం ప్రభుత్వం మరిన్ని స్టాళ్లను ఏర్పాటు చేయకుడా తమ స్టాళ్లను ఖాళీ చేయించడం ఏమిటని ఎస్హెచ్జీకి చెందిన ఓ మహిళ ప్రశ్నించారు. సెర్ప్ అధికారులు అకస్మాత్తుగా తమ స్టాళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారని, లేకుంటే వాటిలోని స్టాక్‌ను రోడ్డు పకన పడేస్తామని బెదిరించారని, సమయం కావాలని వేడుకున్నప్పటికీ వారు వినలేదని మరో మహిళ వాపోయారు. గతంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు వసతి, రవాణా, ఆహార సదుపాయాలు కల్పించేవారని, ఇప్పుడు అధికారులు వాటిని అందించడం లేదని మరో మహిళ చెప్పగా.. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్న చిత్తశుద్ధి రేవంత్‌రెడ్డి సర్కారుకు ఉన్నదా అని మరో మహిళ ప్రశ్నించారు.