హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): సమయం లేదు. సందర్భం అసలే లేదు. ఉచితానుచితాల ప్రసక్తే లేదు. అధికారిక కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా అనేది పట్టదు. పిడుగుకి, బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి. వేదిక ఏదయినా సరే ఒకటే భాష. ఒకే విధమైన ఊకదంపుడు ఉపన్యాసం. ప్రతిపక్షాలపై విమర్శలు, ఆరోపణలు, తిట్ల పురాణం తప్ప ముఖ్యమంత్రి ప్రసంగ పాఠంలో ఒక్కటంటే ఒక్క మంచి మాటలేకుండా పోతున్నది. సీఎం హోదాకు తలవంపులు తెచ్చేలా రేవంత్‌రెడ్డి ప్రసంగం కొనసాగడంపై విపక్షం, స్వపక్షం అనే కాదు సగటు తెలంగాణ పౌరుడు సైతం ఏహ్యభావాన్ని ప్రదర్శిస్తున్నాడు. పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో ప్రత్యర్థులపై రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించడం పరిపాటి. అది అక్కడి వరకే ఉంటుంది. కానీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ రాజకీయ ప్రసంగాలు చేస్తుండటమే ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది.
కంఠనరాలు చించుకుంటూ, వీరావేశంతో ఊగిపోతూ, ప్రతిపక్ష నేతలపై తిట్లు, విమర్శలు, ఆరోపణలు చేస్తుండటంపై ఉన్నతాధికారులు, ఉద్యోగులు చీదరించుకుంటున్నారు. సీఎం హోదాలో ఉన్నామనే సోయి మరచి ప్రవర్తించడమేంటని ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంద్రాగస్టు వేడుకలైనా, అధికారిక సమావేశాలేమైనా సీఎం వరుస ఇలాగే ఉన్నదని విమర్శలు గుప్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల ఉద్యోగ నియామకపత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంపై తెలంగాణ సమాజం యావత్ దుమ్మెత్తిపోసింది. నూతనంగా ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థులు సైతం సీఎంను చీదరించుకుంటూ ఆయా సభల్లో కనబడటం కొసమెరుపు. సాధారణంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రేరణ కలిగించేలా ఏ ముఖ్యమంత్రయినా దిశానిర్దేశం చేస్తారు. కార్యక్రమానికి సంబంధం లేని రాజకీయ అంశాలన్నీ ప్రస్తావిస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడమేంటని ఉన్నతాధికారులు సైతం ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలిని సైతం పలువురు ఉన్నతాధికారులు గుర్తుచేసుకుంటుండడం విశేషం.
సీఎం తీరుపై ఇంజినీర్ల అసహనం
ముఖ్యమంత్రి ఇటీవల వరుసగా చేస్తున్న విమర్శలపై రాష్ట్రంలోని ఇంజినీర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సాగునీటిశాఖలోని సీనియర్ ఇంజినీర్లు రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పిల్లలను అభినందించి, వారి ముందు సీనియర్లను తూలనాడటం, కించపరచడం ముఖ్యమంత్రికి తగని పనంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు నేర్చుకోవలసింది మళ్లీ ఆ సీనియర్ల నుంచే కదా, మరి సీనియర్లను కించపరిస్తే వారికి ఏమి గౌరవముంటుందని ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ఇంజినీర్లు ఆదర్శం కావద్దని ముఖ్యమంత్రి మాత్రమే కాదు ఇటీవల మరో మంత్రి కోమటిరెడ్డి కూడా వ్యాఖ్యానించడంపై ఇంజినీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం కూలిపోయిందా? కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక మేడిగడ్డ బరాజ్‌లో ఒక బ్లాక్‌లో మూడు పియర్లు కుంగుబాటుకు గురయ్యాయి తప్ప, కాళేశ్వరంలో అన్ని వ్యవస్థలు వినియోగంలో ఉన్నాయి కదా? మరి కాళేశ్వరం కూలిపోయిందని ముఖ్యమంత్రి, మంత్రులు ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు.
మిగతా లింకులు వినియోగంలో ఉన్నాయి కనుకనే కొండ పోచమ్మ దాకా నీరు చేరిందని, ఆ నిర్మాణాలు చూసిన వారికి కళ్లు తిరిగిపోతాయని, అంతటి గొప్ప స్ట్రక్చర్స్ నిర్మించిన ఇంజనీర్లు ఆదర్శం కావద్దని చెప్పడమేంటని మండిపడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణం కొనసాగుతున్న సమయంలో సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుసేన్, చీఫ్ ఇంజినీర్ సీకేఎల్ దాస్ వంటి ప్రముఖులు తెలంగాణ ఇంజినీర్లకు సలాం కొట్టడమే కాదు, ప్రాజెక్టు ఒక ఇంజినీరింగ్ వండర్ అని పొగిడి వెళ్లారని, అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్లు కూడా ప్రాజెక్టును సందర్శించి ఆ మహా నిర్మాణాలను చూసిన తర్వాతనే ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్ అండ్ పార్ట్నర్షిప్’ అనే ప్రశంసా పత్రాన్ని ఇచ్చారని గుర్తుచేస్తూ సీఎం వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక ఇంజినీర్ గర్వంగా ఫీలవుతారని, అది వారికి దకిన జీవిత కాలపు గొప్ప గౌరవమని, ముఖ్యమంత్రి, మంత్రులు పదేపదే తూలనాడుతూ మాట్లాడడం గర్హనీయమని ఇంజినీర్లు నిప్పులు చెరుగుతున్నారు. సీనియర్ల నుంచే జూనియర్లు తప్పకుండా నేర్చుకొని ముందుకు సాగవలసి ఉందని, నిజానికి ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో తెలంగాణ ఇంజనీర్లకు ఎవరూ సాటి రారనని ఇంజినీర్లు వివరిస్తున్నారు. తెలంగాణ ఇంజనీర్లు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నారని, ఇకనైనా రాజకీయ వ్యాఖ్యలతో రాష్ట్ర ఇంజినీర్లను నిరుత్సాహపరచవద్దని ముఖ్యమంత్రి, మంత్రులను ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు.