ఆదిలాబాద్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటను విక్రయించడానికి వచ్చిన రైతుపై ఓ అధికారి దాడి చేశారు. శుక్రవారం రాత్రి జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన రైతు సండే మహేశ్ పత్తిని విక్రయించడానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చాడు. అక్కడ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో గుడిహత్నూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో సోయాబిన్ కొనుగోలు చేస్తున్నారు. రైతు పత్తిని అన్లోడ్ చేస్తున్న క్రమంలో సోయాబిన్ కొనుగోలు కేంద్రం ఇన్చార్జి గుడిహత్నూర్ పీఏసీఎస్ సెక్రటరీ కేంద్రే పండరి మద్యం మత్తులో రైతు మహేశ్‌పై దుర్భాషలాడుతూ దాడిచేశాడు. బాధిత రైతు టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా .. పోలీసులు విచారణ జరిపారు. సెక్రటరీ పండరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్టు తేలిందని టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ పేర్కొన్నారు.
సిబ్బంది సస్పెన్షన్
రైతుపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు పీఏసీఎస్ సిబ్బంది ఇద్దరిని సస్పెండ్ చేసినట్టు ఆదిలాబాద్ జిల్లా సహకార అధికారి మోహన్ తెలిపారు. గుడిహత్నూర్ పీఏసీఎస్ సెక్రటరీ పండరి, మన్నూర్ పీఏసీఎస్ సెక్రటరీ వెంకటిని విధుల నుంచి సస్పెండ్ చేయడంతోపాటు ఏడు రోజుల వేతనం నిలిపివేసినట్టు వెల్లడించారు. రైతు ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశానుసారం విచారణ జరిపి, సీసీ ఫుటేజీను పరిశీలించి ఇద్దరు సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.