ఖిలా వరంగల్ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా సంస్థలు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు(ఆక్టోపస్) చారిత్రక నగరమైన ఓరుగల్లు కోటలోని ప్రధాన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలపై రెక్కీ (ముందస్తు నిఘా) నిర్వహించారు. ఈ ఘటనల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు హైదరాబాద్ నుంచి 25 మంది ప్రత్యేక పోలీసు బృందం ఓరుగల్లుకు చేరుకున్నారు. వీరు ముఖ్యంగా వరంగల్ కోట, వేయి స్తంభాల ఆలయం సహా అనేక దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, భౌగోళిక పరిస్థితులను పసిగట్టే పనిలో నిమగ్నమయ్యారు.
పురావస్తు శాఖ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
కేంద్ర పురావస్తు పర్యవేక్షణలో ఉన్న చారిత్రక స్థలాలు, నిర్మాణాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా, ఏకశిలగుట్ట, ఖుష్ మహల్, స్వయంభు దేవాలయాల మధ్య ఉన్న పురాతన కళా ఖండాలు, కళాతోరణాలను క్షుణ్ణంగా పర్యవేక్షించి, వాటి రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ రెక్కీ బృందానికి కేంద్ర పురావస్తు శాఖ ఖిలా వరంగల్ కోఆర్డినేటర్ శ్రీకాంత్, సిబ్బంది సహకారం అందించారు.
కాకతీయుల వైభవాన్ని వివరించిన గైడ్
పోలీస్ బృందానికి పర్యాటక శాఖ నియమించిన గైడ్ రవియాదవ్ తోడుగా ఉండి కాకతీయుల ఘనమైన చరిత్రను, పాలనా వైభవాన్ని వివరంగా తెలియజేశారు. కోటలు, ఆలయాల నిర్మాణంలో కాకతీయుల శిల్పకళా నైపుణ్యాన్ని, ఆనాటి వైభవాన్ని ప్రతిబింబించే శిల్పాలను చూపిస్తూ గైడ్ వారికి పూర్తి సమాచారం అందించారు. దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలపై భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా ఈ ముందస్తు తనిఖీలు, రెక్కీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ బృందం ఈ ప్రాంతంలోని భద్రతా లోపాలను, ముప్పు కలిగే అవకాశాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తమ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిసింది.