హైదరాబాద్, జూలై19 (నమస్తే తెలంగాణ): గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంపై అన్నివైపులా తీవ్ర అభ్యంతరాలు, విముఖత వ్యక్తమైంది. ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి పీఎఫ్ఆర్ (ప్రీ ఫిజబులిటీ రిపోర్టు)ను కేంద్ర జల్‌శక్తి శాఖకు సమర్పించిన విషయం విధితమే. ఆ ప్రాజెక్టు పీఎఫ్ఆర్పై అభిప్రాయాలను తెలపాలని కేంద్రం తన పరిధిలోని జాతీయ సంస్థలకు, బేసిన్ పరిధిలోని తెలంగాణ సహా అన్ని రాష్ర్టాలకు లేఖలు రాసింది. ప్రతీ కేంద్ర సంస్థ కూడా బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడంపై విముఖతను వ్యక్తం చేయడంతోపాటు, అనేక అభ్యంతరాలను లేవనెత్తాయి. ఆయా సంస్థలు ఏకంగా ప్రాజెక్టు వద్దే వద్దే అని తేల్చిచెప్పాయి. అన్ని రాష్ర్టాలూ అదే మాటను వ్యక్తంచేశారు.
1) కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వరద జలాల లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలి.
2) 1980 గోదావరి ట్రిబ్యునల్ అవార్డు (తీర్పు)కు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టు ఉన్నదన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
3) అంతర్రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా తయారీకి ముందు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై స్పష్టత కోసం కేంద్ర జలసంఘం అనుమతి తీసుకోవాలి.