హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చించేందుకు ఈ నెల 16న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఎన్‌డబ్ల్యూడీఏ(నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ) సమాలోచనలు చేస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర జల్‌శక్తిశాఖకు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి నదుల అనుసంధానంపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్రతో ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ఆయా నదుల అనుసంధానానికి ప్రతిపాదనలు పెట్టడం, అభ్యంతరాలు లేవనెత్తడం కొనసాగుతున్నది. దీంతో కేంద్ర జల్‌శక్తిశాఖ రంగంలో దిగింది. గతంలోనే సమావేశం నిర్వహించి రాష్ట్రాలన్నీ ఎవరికి వారు ఎకువ వాటాలు అడిగితే నీళ్లు ఎకడి నుంచి తెచ్చిస్తారని, రాష్ట్రాలు కావాలనుకుంటే ఇంట్రా లింకింగ్‌కు(రాష్ట్రం లోపల చేపట్టే అనుసంధానం) కేంద్రం నుంచి సహకారం అందిస్తామని తేల్చి చెప్పింది. అందుకోసం అన్ని రాష్ట్రాల సెక్రటరీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తామని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖకు ప్రతిపానదలు పంపినట్టు తెలిసింది.
కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 అవార్డు అంశంపై రాష్ర్టాలతో కేంద్ర జల్‌శక్తిశాఖ ఈ నెల 7న నిర్వహించతలపెట్టిన సమావేశం వాయిదాపడింది. ఈ మేరకు రాష్ర్టాలకు సమాచారం అందించింది. తదుపరి సమావేశ తేదీన త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 అవార్డును 2010లో ప్రకటించగా, పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో అవార్డు ఇప్పటికీ అమలులోకి రాకుండాపోయింది. సుదీర్ఘంగా కోర్టు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో జలహక్కులను కోల్పోతున్నామని కర్ణాటక, మహారాష్ట్ర సైతం కోర్టును ఆశ్రయించాయి.