Khammam | రఘునాథపాలెం, మే 20: చిన్నారి కంట్లో నుంచి గింజలు, రాళ్లు వస్తున్న ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. కానీ నగరంలోని మమత దవాఖాన వైద్యులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. ఆ బాలిక తనకు తెలియకుండానే బియ్యపు గింజలు, దూది గింజలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, గోర్లు వంటివి తన కంట్లో పెట్టుకుంటున్నదని పేర్కొంటున్నారు. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద కిష్టాపురానికి చెందిన భూక్యా దస్రు – దివ్య దంపతులు. వీరి ఆరేండ్ల కూతురు సౌజన్య కంట్లో నుంచి మూడు నెలలుగా పలు రకాలు గింజలు, రాళ్లు వస్తుండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. భయాందోళనతో అప్పుడే స్థానిక వైద్యుడిని సంప్రదించారు. ఆయన ఇచ్చిన చుక్కల మందునే బాలిక కంట్లో వేస్తున్నారు. సమస్య పునరావృతం కావడంతో శనివారం ఖమ్మంలోని మమత హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.
కానీ వైద్యులు ఆ బాలికను పరీక్షించి గింజలు, రాళ్లు వాటంతట అవే రావడం లేదంటూ కొట్టిపారేశారు. పాపకు ఉన్న చెడు అలవాటు కారణంగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంటుందని వెల్లడించారు. నోట్లో వేళ్లు పెట్టి గోర్లు కొరికినప్పుడో, నోట్లో ఏదైనా పెట్టుకొని నమిలినప్పుడు ఆ బాలిక వాటిని తీసి తనకు తెలియకుండానే కంట్లో పెట్టుకుంటున్నదని అన్నారు. పాపను రెండు గంటలు పరిశీలనలో ఉంచామని, ఆమె తన నోటితో గోర్లు కొరికి కంట్లో పెట్టుకోవడాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని చెప్తున్నారు. అయితే పాపకు ఉన్న ఈ అలవాటును కౌన్సెలింగ్ ద్వారా నివారించవచ్చని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. కానీ బాలిక తల్లిదండ్రులు కూడా వైద్యుల మాటను కొట్టిపారేస్తున్నారు. వ్యర్థాలు కంట్లోంచి వాటంతట అవే వస్తున్నాయని చెప్తున్నారు. రోజూ ఉదయం కంట్లోంచి వ్యర్థాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. పాప కంట్లోంచి వ్యర్థాలు వస్తున్నాయం టూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిన్నారికి, ఆమె తల్లిదండ్రులకు రెండు రోజులపాటు కౌన్సెలింగ్ ఇస్తామని, ఆ తర్వాతే పాపను డిశ్చా ర్జి చేస్తామని హాస్పిటల్ ఆర్ఎంవో సంతోష్‌రెడ్డి, సూపరింటెండెంట్ రామస్వామి తెలిపారు.