హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు పోషక విలువలు గల మధ్యాహ్న భోజనం పెట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకొని పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ పథకం అమలులో పాఠశాల యాజమాన్య కమిటీలు, విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. విద్యార్థులకు వారానికి మూడుసార్లు కోడిగుడ్లను తప్పనిసరిగా ఇవ్వాలని, వేడిగా ఉన్న ఆహారమే వడ్డించాలని ఆదేశించారు. విద్యార్థులకు భోజనం వడ్డించే ముందు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు విధిగా రుచి చాడాలని, రుచి చూసిన వారు టేస్టింగ్ రిజిస్టర్లో సంతకం చేయాలని పేర్కొన్నారు.
మంచినీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భోజనానికి ముందు, తరువాత విద్యార్థులు శుభ్రంగా చేతులు కడుక్కోవాలని సూచించారు. వంద శాతం విద్యార్థుల ఆధార్ నంబర్లు నమోదుచేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా విద్యార్థులకు అందజేసే కోడిగుడ్ల సేకరణ ధరను ప్రభుత్వం రూ.5 కు పెంచింది. ఇదివరకు రూ.4 ఉండగా, తాజా రూ.5 కు పెంచుతూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో -42ను విడుదల చేశారు.