నిజామాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ( Budget ) అంకెల గారడీగా ప్రజలను మోసం చేసేదిగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) విమర్శించారు. బడ్జెట్‌తో తో ప్రజలకు ఒరిగేది శూన్యమని పేర్కొన్నారు. మహిళలు,పేద ప్రజలను, నిరుద్యోగులను వంచించిన బడ్జెట్ అని ఆరోపించారు.
ఆరు గ్యారంటీలకు( Six Guarantees ) మంగళం పాడిన బడ్జెట్ అని పేర్కొన్నారు.ప్రజలకు ఉపయోగపడే స్కీమ్‌లకు సరైన కేటాయింపులు లేవని, అవినీతి అవకాశాలు ఉన్న ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయించారని వెల్లడించారు.గత సంవత్సరం బడ్జెట్ అంచనాలను ఈ ప్రభుత్వం అందుకోలేక పూర్తిగా విఫలమైందని ఇప్పటికే స్పష్టమైందని అన్నారు. అయినా కూడా మళ్లీ అదే విధంగా అంకెల మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు.
కోటి 58 లక్షల మహిళలకు ఇస్తానన్న రూ. 2,500 చేయూత పథకం ప్రస్తావనే లేదు. వృద్దులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంపు కేటాయింపులు లేవు.తులం బంగారం హామీ పూర్తిగా మర్చిపోయారు.జాబ్ క్యాలెండర్‌ను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు.
రైతు భరోసా పేరుతో హామీలు ఇచ్చినా, ఇప్పటివరకు మూడు పంటలకు ఎగ్గొట్టారని,ఆచరణ కు సాధ్యం కానీ రాజీవ్ యువవికాసానికి మాత్రం బడ్జెట్ లో ప్రతి సారి కేటాయింపులు చేస్తూ వస్తున్నారని ఆరోపించారు.ఈ ప్రభుత్వానికి భూములపై ఉన్న ప్రేమ, ప్రజలకు ఇచ్చిన హామీలపై లేదని తెలిపారు.