హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో తన పేరు లేకుండా విదేశాలకు పారిపోతున్నానంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎలా చెప్తారని ఎన్టీవీ జర్నలిస్టు దొంతు రమేశ్ ప్రశ్నించారు. సజ్జనార్ తీరును ఖండిస్తూ ఆయన బుధవారం ఓ వీడియోను విడుదల చేశారు. కేసులు, ఎన్కౌంటర్లకు భయపడే మనస్తత్వం తనది కాదని తేల్చి చెప్పారు. ఎన్టీవీ కథనంపై మోపిన కేసుకు సంబంధించి సిట్ టీమ్ నోటీసులు ఇచ్చిందా? ఇస్తే రుజువు చూయించగలరా? కనీసం మౌఖికంగా అయినా సీసీఎస్ ఆఫీసుకు రావాలని చెప్పారా? ఎఫ్ఐఆర్లో తన పేరు ఉందా? పోలీస్ కమిషనర్‌ను ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవేవీ చేయకుండా తాను బ్యాంకాక్‌కు పారిపోతున్నానని ఎలా ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. తానేమీ నీరవ్ మోదీ, విజయ్మాల్యాలాగా వేల కోట్లు బ్యాంకుల నుంచి దోచుకుని దేశం విడిచి పారిపోవడం లేదని స్పష్టంచేశారు. తనకు నోటీసులు ఇవ్వనప్పుడు, తన పేరు ఎఫ్ఐఆర్లో లేనప్పుడు తాను విదేశీ ప్రయాణం చేయడం నేరం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు.
ఈ నెల 18 నుంచి దావోస్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కవరేజీకి ఎన్టీవీ తరఫున వెళ్లాల్సి ఉండటంతో నాలుగు రోజులపాటు బ్యాంకాక్‌కు వెళ్లి అక్కడి నుంచి దావోస్ వెళ్లాలని భావించినట్టు రమేశ్ తెలిపారు. బీసీలు, దళిత బిడ్డలం కాబట్టే తనతోపాటు మరో ఇద్దరు జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ ఉంటే బయట తిరగగలరా? అని సజ్జనార్ మీడియా ముందు అంటున్నారని నాడు ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీకి ఏమైందో ఆయనకు తెలియదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో మల్టీ లెవల్ మార్కెటింగ్, ఇటీవల బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై ప్రముఖులను విచారణ పేరిట పిలిచారని ఆ కేసుల సంగతి ఏమైంది? అని తాము ప్రశ్నిస్తామని తెలిపారు. చట్టం, న్యాయం తన వైపు ఉండటంతోనే తాను ఈ రోజు బయట ఉన్నానని తెలిపారు. కొంతమందిని సంతృప్తిపర్చేందుకు మరికొంత మందిని బలిపశువులను చేయాలనుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు.