ఉచిత విద్యకు జర్మనీ కేరాఫ్ అడ్రస్. అక్కడ అత్యధికం పబ్లిక్ యూనివర్సిటీలే ఉంటాయి. వాటిలో ట్యూషన్ ఫీజు కింద రూపాయి కూడా తీసుకోరు. అంతర్జాతీయ విద్యార్థుల నుంచీ వసూలు చేయరు. కొన్ని వర్సిటీలు రిజిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం గరిష్ఠంగా రూ.300 -500 యూరోలు వసూలు చేస్తుంటాయి.
ప్రస్తుతం 40 వేల మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. జర్మనీలో ఇలా ఉచిత విద్య అందుబాటులో ఉన్నా జేఎన్టీయూ మాత్రం రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నది. ఫీజులే తీసుకోని దేశంలో ఊరూపేరూలేని సంస్థలతో ఒప్పందం చేసుకొని, కోర్సులు ఆఫర్ చేస్తూ, రూ.21 లక్షల ఫీజు వసూలు చేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ ఆఫర్ చేస్తున్న రెండు జర్మన్ కోర్సుల ఫీజులు చూస్తే జడుసుకోవాల్సిందే. వాస్తవానికి రోట్లింజన్ హోప్ షూ లే యూనివర్సిటీలో సెమిస్టర్‌కు 1,500 యూరోలు (దాదాపు రూ.లక్షన్నర) ఫీజుగా తీసుకుంటున్నారు. నాలుగు సెమిస్టర్లకు కలిపి 6వేల యూరోలు (సుమారు రూ.6లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. కానీ జేఎన్టీయూ మాత్రం మొదటి సెమిస్టర్‌కు 3 వేల యూరోలు (దాదాపు రూ.మూడు లక్షలు), మిగతా మూడు సెమిస్టర్లకు 6 వేల యూరోల చొప్పున నాలుగు సెమిస్టర్లకు కలిపి 21 వేల యూరోలు వసూలు చేస్తున్నది. అంటే రోట్లింజన్ హోప్ షూలే కన్నామూడున్నర రెట్లు ఎక్కువ. ఇది పెద్ద దందా అని, కన్సల్టెంట్లకు 15శాతం కమీషన్ కింద పోతున్నదని ఆరోపణలున్నాయి. ప్రవేశాల కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీ ఎందుకు రంగంలోకి దిగింది? వంగపండు పాత్ర ఏమిటి? అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
అక్కడ స్కాలర్షిప్లు కూడా..
జర్మనీలో జీవన వ్యయం సంవత్సరానికి 12 వేల యూరోల లోపే. జర్మన్ అకాడమిక్ ఎక్స్చేంజ్ సర్వీస్ (డాడ్) ఏటా లక్ష మందికి స్కాలర్షిప్లు ఇస్తుంది. మాస్టర్ గ్రాడ్యుయేట్లకు 992 యూరోలు, డాక్టోరల్ కు 1300 యూరోలు స్కాలర్‌షిప్‌గా ఇస్తున్నారు. ఇందు లో భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. హాంబర్గ్, హంబోల్డ్ వంటి వర్సిటీలు ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్, రీసెర్చ్ ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. ఉచిత విద్య అందించే, స్కాలర్షిప్లు ఇచ్చే విద్యాసంస్థలు ఉండగా, రూ.21 లక్షలు ఫీజు వసూలు చేసే ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం ఎందుకన్నది నిపుణుల ప్రశ్న.
అడుగడుగునా అనుమానాలే
ఒక ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకుడు జేఎన్టీయూ క్యాంపస్‌లో చిన్న గది అద్దెకు తీసుకుని శిక్షణ ఇచ్చినంత మాత్రాన ఆ ట్రైనింగ్ సెంటర్ ఇచ్చే సర్టిఫికెట్ జేఎన్టీయూతో సమానం అవుతుందా? ఆ కోర్సులన్నీ జేఎన్టీయూ కోర్సులవుతాయా? జేఎన్టీయూ ఆచార్యులు జర్మనీకి వెళ్లి చేసిన ఒప్పందాలు కూడా ఇలాగే ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒప్పందం కుదుర్చుకున్న అకాడమీ రోట్లింజన్ యూనివర్సిటీలో భాగమే అయితే.. వర్సిటీ వెబ్సైట్లో ఆ అకాడమీ సీఈవో స్థాపించిన నాలెజ్డ్ ఫౌండేషన్ గుర్తించి ఎందుకు ప్రస్తావించలేదు? జేఎన్టీయూ, జర్మనీకి చెందిన ట్రైనింగ్ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే దాని గురించి జేఎన్టీయూ, సదరు ట్రైనింగ్ సెంటర్ ప్రచారం చేయాలి. మధ్యలో ‘వంగపండు’ ఎందుకు? థర్డ్ పార్టీ ‘వంగపండు’ స్పెషల్ వీడియోలు చేయించి, సొంత ఫోన్ నంబర్లు ఇచ్చి మరీ ప్రమోట్ చేయాల్సిన పని ఏమిటని అడుగుతున్నారు. జేఎన్టీయూ వెబ్సైట్లోనే అడ్మిషన్స్ డైరెక్టర్ నంబర్లు ఇచ్చారు. ఆ నంబర్లను సంప్రదిస్తే ప్రైవేట్ వ్యక్తులు సమాధానం ఇస్తున్నారు.
చర్చలకు ఎందుకు వెనుకడుగు?
జర్మనీ సంస్థలతో జేఎన్టీయూ ఒప్పందాలపై కొందరు వర్సిటీకి ఫిర్యాదుచేశారు. జర్మనీ టాప్-3 ర్యాంక్ విశ్వవిద్యాలయం అని చెప్పిన సంస్థ వేరని, ఒప్పందం చేసుకున్న రోట్లింజన్ వర్సిటీ వేరు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు నిజమైన రోట్లింజన్ ఆచార్యులతో భేటీ అవుదామని ఆన్లైన్ మీటింగ్‌కు ఆహ్వానించారు. ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ అకాడమీ సామర్థ్యం, సర్టిఫికెట్ల విలువపై చర్చించేందుకు అరగంట సమయమివ్వమంటే జేఎన్టీయూ వీసీ, అధికారులు ఒప్పుకోవడంలేదని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. మన దగ్గరి నుంచి వెళ్లే విద్యార్థుల్లో అత్యధికులు అప్పులు చేసి, ఆస్తులు కుదవపెట్టి వెళ్తుంటారు. రూ.21లక్షలు పెట్టిన చదువు, సర్టిఫికెట్ చెల్లుబాటుకాకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? జర్మనీలోని కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఫీజులు మరీ భారీగా ఏం లేవు. జేఎన్టీ యూ ఒప్పందం చేసుకున్న సంస్థకు ఎందుకిం త ఫీజులు చెల్లించాలి? రూ.21లక్షల్లో జేఎన్టీ యూ రూ.3 లక్షలు తీసుకోగా, మిగతా రూ. 18 లక్షలు జర్మనీ సంస్థలకు చెల్లిస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను బట్టి రూ.18 లక్షల్లో ఎవరి వాటా ఎంత? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
మరికొన్ని ప్రశ్నలు
సోమవారం సమీక్ష
జర్మనీలోని విద్యాసంస్థలతో ఒప్పందాలపై జేఎన్టీయూ వర్సిటీ సోమవారం సమీక్షించనున్నట్టు తెలిసింది. డమ్మీ వర్సిటీ.. ఫేక్ కోర్సులు శీర్షికతో నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారుల్లో చలనం మొదలయ్యింది. ఈ ఒప్పందం విషయంలో వస్తున్న అనుమానాలు, సందేహాలపై సుదీర్ఘంగా సమీక్షించనున్నట్లు వర్సిటీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే విషయంపైనా సర్కారు వర్గాలు కూడా ఆరా తీసినట్టు తెలిసింది.