వేములవాడ, జూలై 22: అమెరికాలో స్థిరపడిన ఓ మహిళ కాన్పు కోసం పుట్టింటికి వచ్చి సర్కారు దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన హైమావతికి ఐదేండ్ల క్రితం అమెరికాకు చెందిన వ్యక్తితో వివాహమైంది. యూఎస్‌లోనే ఉంటున్న ఆమె గర్భందాల్చగా అక్కడి దవాఖానల్లోనే నెలనెలా పరీక్షలు చేయించుకొన్నారు. నెల క్రితం పుట్టింటికి వచ్చారు. వేములవాడ ప్రభుత్వ దవాఖానలో సేవలు బాగున్నాయని బంధువులు, స్థానికులు చెప్పడంతో గత సోమవారం ఆమె ప్రసవం కోసం దవాఖానలో చేరారు. వైద్యులు సాధారణ కాన్పు చేయగా పండంటి ఆడబిడ్డుకు జన్మనిచ్చింది. అనంతరం వైద్య సిబ్బంది అందజేసిన కేసీఆర్ కిట్‌ను చూసి మురిసిపోయింది హైమావతి. ఇక్కడి వైద్య సేవలు బాగున్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె డిశ్చార్జి కాగా వైద్యులు సంతోష్‌చారి, స్టాఫ్ నర్సు భాగ్యలక్ష్మి తదితరులు ఆమెను దగ్గరుండి ఇంటికి పంపించారు.