హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నికల హామీల అమలులో వైఫల్యాన్ని, ప్రజాప్రతినిధులపై వేధింపులను నిరసిస్తూ ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం వినూత్న నిరసన చేపట్టింది. ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇన్ చార్జ్ అనిల్ బైరెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి గురువారం నిరసన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యల పరిషారం, హామీల అమలుపై ప్రజలకు స్పష్టమైన జవాబుదారీతనం ఉండాలని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలన కొనసాగాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేశ్ ముత్యాల, రాహుల్ నడిదె, సత్య గుండా, రవీందర్ చుకా, కార్తీక్, రమణ, చందు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు, ప్రతిపక్ష హకులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాష్ట్రంలో పోలీసు, పరిపాలనా యంత్రాంగాన్ని ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులకు సాధనాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాణ భద్రతపై అనిల్ కూర్మాచలం తన లేఖలో ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి యత్నాలు, ఆయనకు వస్తున్న బెదిరింపుల విశ్వసనీయతపై తక్షణమే సమగ్ర సమీక్ష నిర్వహించి, బెదిరింపుల మూలాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.