హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని నిరర్ధక (ఎన్పీఏ) ప్రభుత్వ తీరు వల్లే ప్రజలపై పెట్రో భారం పడుతున్నదని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్ రాష్ర్టాలు వ్యాట్ (వీఏటీ) తగ్గించలేదని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ర్టాలు వ్యాట్ తగ్గిస్తే ప్రజలపై పెట్రో ధరల భారం తగ్గుతుందని కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు.
ఎన్పీఏ ప్రభుత్వ కారణంగానే ఇంధన ధరలు పెరిగాయని మండిపడ్డారు. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇంధన ధరలపై వ్యాట్ పెంచలేదని ఆయన తేల్చిచెప్పారు. తాము వ్యాట్ పెంచనప్పటికీ రాష్ట్రాలపై నెపం వేయటం దారుణమన్నారు. మోదీ అనుసరించే సహకార సమాఖ్య (కో-ఆపరేటివ్ ఫెడరలిజం) విధానం ఇదేనా? అని కేంద్రమంత్రి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.