కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : ఆయూష్ మాప్ అప్ విడత కౌన్సెలింగ్కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయూష్ యూజీ కన్వీనర్ కోటా సీట్లకు మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించింది. విశ్వవిద్యాలయం పరిధిలోని హోమియోపతి (బీహెచ్ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), నేచురోపతి-యోగా (బీఎన్వైసీ), యునాని (బీయూఎంఎస్) డిగ్రీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.
ఇప్పటికే అఖిల భారత కోటాలో ఆయుష్ కోర్సుల్లో చేరిన, కాళోజీ, ఎన్టీఆర్ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులతో పాటు గత విడతలో సీటు వచ్చినా.. చేరని అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్కు అనర్హులని పేర్కొంది. మరింత సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.knruhs.telangana.gov.inను చూడాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.