హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు బోర్డు వెబ్సైట్ (https://mhsrb. telangana.gov.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు సవరించుకోవచ్చు. నవంబర్ 17న కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్లో ప్రభుత్వం తెలిపింది.
వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు తొలుత విడుదల చేసిన నోటిఫికేషన్ తప్పులతడకగా ఉన్నది. 2024 సెప్టెంబర్లో దరఖాస్తులు స్వీకరించి 2023 అక్టోబర్లో దరఖాస్తులను ముగిస్తారట. ఆన్లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ 14-10-2023 అని నోటిఫికేషన్లో ఉన్నది. తమ దరఖాస్తులను 16-10-2023న ఉదయం 10.30 గంటల నుంచి 17-10-2023 సాయంత్రం 5 గంటలకు సవరించుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత ఈ తప్పులను సవరించి మరోమారు నోటిఫికేషన్ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం 2,050 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు, ఆరోగ్యశాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపింది.
17