APGVB | అచ్చంపేట/అచ్చంపేట రూరల్, అక్టోబర్ 13 : రుణమాఫీ రైతుల పాలిట శాపంగా మారింది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారంలో బ్యాంక్ నోటీసుల పరంపర కొనసాగుతున్నది. వ్యవసాయ రుణాన్ని వడ్డీసహా చెల్లించాలని ఆరు నెలల కిందట చనిపోయిన రైతు బూరం రామచంద్రయ్య పేరిట అచ్చంపేట ఏపీజీవీబీ బ్రాంచ్ నుంచి శుక్రవారం పోస్ట్ ద్వారా నోటీసులు రాగా.. ప్రస్తుతం రామచంద్రయ్య చనిపోవడంతో అతడి భార్య బాలింగమ్మకు పోస్ట్మాన్ శివ అందజేశారు. రూ.1.36 లక్షలు వడ్డీ సహా చెల్లించాలని పేర్కొన్నారు.
బూరం రామచంద్రయ్యతోపాటు అదే గ్రామానికి చెందిన బోడ అంతయ్యకు నోటీసులు వచ్చాయి. అసలు రూ.1.50 లక్షలు కాగా.. 13 సెప్టెంబర్ 2024 నాటికి వడ్డీ కలిపి రూ 1,71,547.54 చెల్లించాలంటూ తాఖీదులు అందాయి. నోటీసును పంపేందుకు అయిన రూ.59 కూడా ఖాతాలో జమచేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, అనారోగ్యానికి గురి కావడంతోపాటు పండుగకు ఆడబిడ్డ ఊరికి వెళ్లడంతో ఆయన తరఫున నోటీసులు ఎవరూ అందుకోలేదు. ఇంత కాలం మాఫీ అవుతుందని ఆశతో ఎదురుచూసిన రైతులకు నోటీసులు రావడంతో అవాక్కవుతున్నారు. వారం క్రితం అచ్చంపేట ఏపీజీవీబీ నుంచి నీలం వెంకటయ్య, గెనమోని జంగయ్య, ఉడుత పార్వతమ్మకు బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. తాజాగా శుక్రవారం మరో ఇద్దరు రైతులకు నోటీసులు వచ్చాయి. ప్రభుత్వం పండుగపూట రైతుల కంట్లో కన్నీళ్లు వచ్చేలా చేస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బూరం రామచంద్రయ్య 5-మే 2022న రూ.1.36 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. నాటి నుంచి 13 సెప్టెంబర్ 2024 వరకు రూ.4,394 కలిపి అసలు చెల్లించాలని బ్యాంకులు నోటీసులిచ్చాయి. ఏడాది దాటినందున 14 శాతం వడ్డీ చెల్లించాలంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోగా బ్యాంకులో ఉన్న అప్పు తీర్చాలని చనిపోయిన వ్యక్తికి నోటీసులు పంపించడం బాధగా ఉన్నది. పండుగపూట రెండు ముద్దలు తిందామంటే ఇలా నోటీసులు పంపి ముద్ద దిగకుండా చేస్తున్నరు.