హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): వేర్వేరు కోర్టు ధిక్కరణ కేసుల్లో హైకోర్టు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని రఫా ఇ ఆమ్ ఉన్నత పాఠశాల సిబ్బందికి జీతాలు చెల్లించాలని గత ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై దాఖలైన కేసులో వివరణ ఇచ్చేందుకు మార్చి 10న జరిగే విచారణకు స్వయంగా హాజరుకావాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేనను జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆదేశించారు. 41ఏ నోటీసు ఇవ్వకుండా తనను పోలీసులు అరెస్టు చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకటనర్సింగ్‌రావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. పోలీస్ కమిషనర్ ఆనంద్, సైఫాబాద్ ఏసీపీ సీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ కే సత్తయ్య, సబ్ ఇన్స్పెక్టర్ ఎం. సురేశ్‌రెడ్డికి కోర్టు ధికరణ నోటీసు జారీ చేశారు. విచారణ మార్చి 10కి వాయిదా పడింది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ట్రాన్స్ కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ల సీఎండీలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి విచారించారు. ఆ నాలుగు సీఎండీలకు నోటీసులు జారీ చేసి, విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. తెలంగాణ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి అనుకూలంగా 2019లో ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదని దాఖలైన పిటిషన్లో కౌంటర్ వేస్తామని విద్యుత్ సంస్థల తరఫున న్యాయవాది ఉమాదేవి చెప్పారు.