హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా జీ వైజయంతి నియామకాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ స్థానంలో కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 25ఏ(2) ప్రకారం ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ పోస్టులో వైజయంతి కొనసాగడానికి అర్హత లేదని పేరొంటూ లాయర్ ఎస్ఎల్ శ్రీనివాసులు ఇతరులు వేసిన పిటిషన్‌ను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారించారు. చట్ట విరుద్ధంగా వైజయంతి పదవిలో కొనసాగుతున్నారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. బీఎన్ఎస్ఎస్లోని నిబంధనల ప్రకారం పదేండ్లకు తకువ కాకుండా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలన్న నిబంధన ఉందని తెలిపారు. ప్రాసిక్యూషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ల నియామకానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతి అవసరమని కూడా చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు ప్రభుత్వంతోపాటు వైజయంతికి నోటీసులు జారీ చేసింది.