హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : హెచ్‌సీయూ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. ఈ నెల 9,10 తేదీల్లో విచారణకు హాజరుకావాలని సూచించారు. కాగా, పోలీసులు అందజేసిన నోటీసులపై మన్నె క్రిశాంక్ స్పందించారు. విచారణకు సహకరిస్తానని, కేసులను లీగల్‌గా ఎదుర్కొంటానని ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై 21 అక్రమ కేసులు బనాయించిందని తెలిపారు. హెచ్‌సీయూ ఘటనకు సంబంధించి విడుదల చేసిన వీడియోలన్నీ వాస్తవమేనని అన్నారు. ఎక్కడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు వాడలేదని స్పష్టంచేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ అక్రమాలు, దుర్మార్గాలపై ప్రశ్నించడం ఆపబోనని తేల్చిచెప్పారు.