హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, శాలువాల స్థానంలో నోట్‌పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఇవ్వాలన్న విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి పిలుపునకు విశేష స్పందన లభించింది. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లోని మంత్రిని ఆమె నివాసంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు కమిషనర్ నవీన్‌మిట్టల్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన కలిసి నోట్‌బుక్‌లను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు అంగన్వాడీ పిల్లలకు అండగా నిలువాలని మంత్రి ఆకాంక్షించారు.