Diet College | హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): 65 ఏండ్లకు పైగా చరిత్ర గల నేరెడ్మెట్ ప్రభుత్వ డైట్ కాలేజీకి ఈ ఏడాది కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) గుర్తింపు దక్కలేదు. డీఎడ్ మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, ఇంతవరకు గుర్తింపు దక్కక సీట్లు భర్తీచేయలేని పరిస్థితి నెలకొన్నది. ఎంతో మంది టీచర్లను తయారుచేసి, ఎందరికో జీవితాన్ని ప్రసాదించిన ఈ కాలేజీ ఇప్పుడు కనీసం గుర్తింపును దక్కించుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఈ కాలేజీలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో మొత్తం 150 సీట్లు ఉన్నాయి. ఫస్టియర్‌లో 150, సెకండియర్‌లో 150 చొప్పున 300 సీట్లున్నాయి. ఇప్పటికే ఫస్టియర్‌లో ఒక్కరూ లేకపోగా, ఇప్పుడు సెకండియర్‌లోనూ ఒక్క విద్యార్థి లేకుండా కాలేజీ మొత్తం ఖాళీ అయ్యింది. కాలేజీ గుర్తింపు లేకపోవడంతో డీఎడ్, డీపీఎస్ఈ వంటి కోర్సుల్లో చేరాలనుకునే హైదరాబాద్ జిల్లా విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రైవేట్ కాలేజీల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిరుదు కూడా దక్కని గుర్తింపు
నిరుడు కూడా నేరెడ్మెట్ ప్రభుత్వ డైట్ కాలేజీకి ఎన్సీటీఈ గుర్తింపును ఇవ్వలేదు. ఫెర్పార్మెన్స్ అప్రైజల్ రిపోర్టు (పార్)ను సమర్పించకపోవడంతో గుర్తింపు దక్కలేదు. దీంతో ఫస్టియర్‌లో అడ్మిషన్లు తీసుకోనేలేదు. ఉన్న సెకండియర్ విద్యార్థులు 2023 ఆగస్టులో తమ కోర్సును పూర్తిచేశారు. దీంతో ఈ కాలేజీలో ఇప్పుడు ఒక్క విద్యార్థి కూడా లేకుండాపోతారు. ఈ ఏడాది పార్ రిపోర్టును సమర్పించినా, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక ఈ విద్యాసంవత్సరం గుర్తింపును ఇవ్వలేదు. ఈ కాలేజీలో విద్యార్థులే కాదు.. రెగ్యులర్ లెక్చరర్లు ఒక్కరు కూడా లేరు. ఇంతకాలం ఒక్క ప్రిన్సిపాల్ మాత్రమే ఉండగా, ఆయన కూడా ఇటీవలే రిటైర్ అయ్యారు. దీంతో ఆ పోస్టు ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం 12 గెస్ట్ లెక్చరర్ పోస్టులను మంజూరుచేసి నెట్టుకొస్తున్నారు. భవనాలున్నా.. ఫ్యాకల్టీ లేక, ఎన్సీటీఈ గుర్తింపునివ్వకపోవంతో ఈ కాలేజీ మూసివేత దశలో ఉన్నది. దశాబ్దాల నాటి ఈ కాలేజీని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని మంత్రులు, అధికారుల చుట్టూ గెస్ట్ లెక్చరర్లు తిరుగుతున్నారు.