హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ) : ప్రజారవాణాలో అత్యంత కీలకమైన ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా నిర్వీర్యం చేస్తున్నది. కొత్త బస్సులు కొనకుండా, కొత్తగా బస్స్టేషన్లు నిర్మించకుండా ప్రైవేట్‌పరం చేసే కుట్రలో భాగంగా ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. ఒక్క మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకానికి తప్ప ఇతర బస్‌పాస్‌ల రాయితీల భారం కూడా ఆర్టీసీ నెత్తినే వేసింది. 2023-24 బడ్జెట్లో రోడ్డు రవాణా రుణాలు, ఇతర సేవల విస్తరణ కోసం రూ.850 కోట్లను కేసీఆర్ ఇచ్చారు. 2022-23 బడ్జెట్లోనూ అంతే మొత్తంలో కేటాయించారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మొదటి బడ్జెట్లో మహాలక్ష్మీ పథకానికి(రూ.4,206 కోట్లు) మినహా రుణాలకు, పౌర సేవల విస్తరణకు ఏమీ కేటాయించలేదు.
రూ.9వేల కోట్లతో ప్రతిపాదనలు
రాష్ట్రంలో ప్రజారవాణా బలోపేతం, సేవల ఆధునికీకరణే లక్ష్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆర్టీసీ రూ.9,315.07 కోట్లతో అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. గత రెండు బడ్జెట్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించని ప్రభుత్వం.. ఈసారైనా విడుదల చేస్తుందని అధికారులు సైతం భావించారు. కానీ బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో చర్చించిన ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ ప్రతిపాదనను చెత్తబుట్టలో పడేశారు. బస్‌పాస్‌ల రాయితీలకు 7,776.08 కోట్లు కావాలని ఆర్టీసీ కోరింది. 666 కొత్త బస్సుల కొనుగోలుకు రూ.241.37 కోట్లు ఇవ్వాలని కోరింది. రుణాల చెల్లింపులకు రూ.855.01 కోట్లు, కొత్తగా బస్ డిపోలు, బస్స్టేషన్ల నిర్మాణానికి మరో రూ.406.27 కోట్లు ఇవ్వాలన్నది. వీటిని పక్కనపెట్టి మహాలక్ష్మీకే .4,305 కోట్లు కేటాయించుకున్నారు.
ఆర్టీసీకి అరకొర నిధులా?
ఆర్టీసీకి ప్రభుత్వం అరకొరగా నిధులు కేటాయించడాన్ని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు, టీఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు పీ కమల్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ‘మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీకి ఇస్తున్న సబ్సిడీ విలువ నెలకు రూ.450 కోట్లు ఉంటుంది. దీనికి అదనంగా వివిధ రకాల ప్రయాణికుల సబ్సిడీతో రూ.640కోట్లు అవుతుంది. ఇవన్నీ కలిపితే ఆర్టీసీకి రీయింబర్స్ కిందనే ఏడాదికి రూ.6,040 కోట్లు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టాల్సి ఉంది. కానీ బడ్జెట్లో అన్నీ కలిపి కేవలం రూ.4,305 కోట్లే కేటాయించి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు.
‘మహాలక్ష్మీ’కి పెంచింది సున్నా
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ‘మహాలక్ష్మీ’ కోసం ఈ ఏడాది బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా పెంచలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణాల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా కేటాయింపులు చేయకపోగా, గతేడాది 2025-2026 తరహాలో ఈ సంవత్సరం కూడా రూ.4,305 మాత్రమే విదిల్చింది. ప్రతినెలా రూ.350 కోట్ల వరకూ ఉచిత ప్రయాణానికి చెల్లించాల్సి ఉండగా, అందులో ప్రతినెలా కేవలం 60-70శాతం మాత్రమే చెల్లిస్తుండటంతో బకాయిలు పెరిగాయి.
రూ.15వేల కోట్లు ఇవ్వాలి : జేఏసీ
మహాలక్ష్మీ పథకం కింద జీరో టికెట్ విలువ నెలకు రూ.400 కోట్లు ఉంటే.. ప్రభుత్వం రూ.4,305 కోట్లు కేటాయించడం తగదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. అన్ని రాయితీలు కలిపి రూ.15వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.