హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): స్క్రూటినీ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను తిరస్కరించినట్టు ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 119 నియోజకవర్గాల నుంచి మొత్తం 3,504 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 2,898 నామినేషన్లకు ఈసీ ఆమోదం తెలిపింది. తిరస్కరణకు గురైనవాటిలో అత్యధికంగా మేడ్చల్ నియోజకవర్గంలో 38, ఆర్మూర్‌లో 27, చెన్నూరు, జుక్కల్‌లో 24 చొప్పున ఉన్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. అత్యధికంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి 114, మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 58, ఎల్బీనగర్లో 57, మునుగోడులో 50 మంది పోటీ పడుతున్నారు. అత్యల్పంగా నారాయణపేట నియోజకవర్గంలో ఏడుగురు, బాల్కొండలో తొమ్మిది మంది పోటీలో ఉన్నారు. మొత్తం 27 నియోజకవర్గాల్లో 30కి పైగా నామినేషన్లు నమోదయ్యాయి.
మంగళవారం నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ మొదలైంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ గడువు ముగియనున్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల కమిషన్ నియోజకవర్గాలవారీగా అధికారికంగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది. గుర్తుల కేటాయింపులో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ గుర్తించిన జాబితాలోని గుర్తులను కేటాయిస్తుంది. ఒకవేళ ఒకే గుర్తు కోసం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీపడితే డ్రా తీస్తారు. గుర్తుల కేటాయింపు పూర్తయిన అనంతరం నమూనా బ్యాలెట్‌ను నియోజకవర్గాలవారీగా ఎన్నికల కమిషన్ విడుదల చేయనున్నది. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమంలో పొందుపరుస్తారు.
కాంగ్రెస్ పార్టీని తిరుగుబాటు అభ్యర్థుల భయం వెన్నాడుతున్నది. పార్టీ టికెట్ లభించని పలువురు నాయకులు రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా సూర్యాపేట, బోథ్, వైరా, ఇబ్రహీంపట్నం, ఆదిలాబాద్, వరంగల్ వెస్ట్, మిర్యాలగూడ, నర్సాపూర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు రెబల్ అభ్యర్థుల బెడద అధికంగా ఉన్నది. వారి చేత నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్‌ఠాక్రే, నాయకులు విష్ణునాథ్, మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు చర్చలు సాగిస్తున్నప్పటికీ రెబల్స్ మెత్తబడలేదని తెలుస్తున్నది. దీంతో ఏమి చేయాలో పాలుపోక అధిష్ఠానం పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తున్నా రెబల్స్ మెట్టుదిగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు హైరానా పడుతున్నారు. ఆయా రెబల్స్ బరిలో కొనసాగితే తమకు తీవ్ర నష్టం తప్పదని పార్టీ అధికారిక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.