హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): బీసీ కులగణనకు చట్టపరమైన అడ్డంకులను తొలగించాలని శాసనమండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. బీసీ కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేపడుతున్న చర్యలను ఆయన తప్పుబట్టారు. బీసీ కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, అనుసరించాల్సిన శాస్త్రీయ అంశాల క్రోడీకరణను ఆయన బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న ఏ ఒక్క అంశం ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు.
బీసీ కులగణన విషయంలో 2024 మార్చి 15న రాష్ట్ర శాసనసభ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని సర్కార్ తప్పుదోవ పట్టిస్తుందని, సర్వే పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని వివరించారు. బీసీ కులగణన విషయంలో సర్కార్ లోపభూయిష్టతను గుర్తుచేస్తూ, అనుసరించాల్సిన విధానాలు, న్యాయస్థానాల్లో నిలిచే వాదనలు తదితర అంశాలను ఆయన నోట్స్ రూపంలో అందజేశారు. బీసీ కమిషన్ కాకుండా ప్రత్యేక కమిషన్ వేయాలని తాము సూచించినా సర్కార్ పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వం దాటవేత ధోరణిని విడనాడి, న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. బీహార్ ప్రభుత్వం అనుసరించిన మార్గాన్ని ఇక్కడా పాటించాలని సూచించారు.