హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇవ్వటం లేదు. రెండు, మూడు నెలలకోసారి ఇస్తున్నారు. గత ఏడాదిన్నరగా ఇదేతంతు కొనసాగుతుండటంతో జీతాల కోసం ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇప్పటికే నవంబర్, డిసెంబర్ జీతాలు రాకపోగా, జనవరి వేతనం కూడా వస్తుందో, రాదోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో సంక్రాంతి పండుగకు పస్తులు తప్పవనే నైరాశ్యంలో అర్చక ఉద్యోగులు ఉన్నారు.
కేసీఆర్ హయాంలో క్రమం తప్పకుండా జీతాలు..
దేవాలయాల్లో పనిచేసే అర్చక ఉద్యోగులు 5,625 మందికి ప్రభుత్వోద్యోగుల మాదిరిగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రతినెలా మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జీవో 577 జారీచేశారు. ఇందులో 3,300 మందిని ఎంపిక చేయగా.. వారిలో 700 మంది మరణించారు. ప్రస్తుతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 2,600 మంది వేతనాలు పొందుతున్నారు. కేసీఆర్ హయాంలో ప్రతినెలా జీతాలు అందగా, ఇప్పుడు అందక ఇబ్బంది పడుతున్నారు.
బడ్జెట్ విడుదలలో కిరికిరి..
దేవాదాయశాఖకు ప్రతి ఆలయ ఆదాయం నుంచి 38.5 శాతం పలు రకాలుగా చెల్లింపులు చేస్తున్నట్టు దేవాదాయశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆలయాల నుంచి డబ్బులు తీసుకుని ఏడాదిన్నరకాలంగా సమయానికి జీతాలు చెల్లించకపోవడంతో అర్చక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నవంబర్, డిసెంబర్‌కు సంబంధించిన వేతనం ఇప్పటికీ రాకపోగా వీటికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ కాలేదని ఆ అధికారి తెలిపారు. శాఖాపరంగా సంబంధిత విభాగం నుంచి అర్చక ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన నెలవారీ జీతాల బడ్డెట్ ఫైల్‌ను ఆర్థికశాఖకు పంపిస్తే వెనక్కి తిరిగి పంపించారని ఆ అధికారి చెప్పారు. అయితే, ఆర్థికశాఖలో డబ్బులు లేవంటూ వెనక్కి పంపించారని, ఈ మధ్యకాలంలో ఇలా నాలుగైదు సార్లు జరిగినట్టు దేవాదాయశాఖకు చెందిన మరో అధికారి చెప్పారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ జీతాల చెల్లింపు విషయంలో అర్చక ఉద్యోగ సంఘాలు పలుమార్లు మంత్రిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, కమిషనర్‌ను కలిసి వినతులు ఇచ్చినా ఫలితం లేకుండాపోయినట్టు తెలుస్తున్నది.