హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): నల్లమల అటవీ ప్రాంతంలోకి ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు మూడు నెలలపాటు అనుమతి లేదని అమ్రాబాద్ అటవీశాఖ అధికారి డాక్టర్ రోహిత్ గోపిడి వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 31 వరకు వన్యప్రాణులు ప్రధానంగా పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు సంతానోత్పత్తికి జతకూడే సమయమని తెలిపారు. ఈ కాలంలో 90 రోజుల పాటు సఫారీ టూరిజం ప్యాకేజీని తాతాలికంగా నిలిపి వేస్తున్నామని పేర్కొన్నారు.
సంతానోత్పత్తి సమయంలో పులులకు అలజడి ఉండకూడదనే ఉద్దేశంతో రిజర్వు అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ (ఎన్టీసీఏ) ఆదేశించిందని తెలిపారు. ఈ సమయంలో పులులు చాలా ఆవేశంగా ఉంటాయని, ఇతర జంతువులు, మనుషులపై దాడి చేసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. సమీప గ్రామాల ప్రజలు కూడా పశువులను కోర్ ఏరియాలో కాకుండా బఫర్ ఏరియాలో మేపుకునే అవకాశం కల్పించామని, ఈ విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. సఫారీ సేవలను అక్టోబర్ మొదటివారంలో ప్రారంభించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.