Current Bill | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపుపై సర్కారు వెనక్కి తగ్గింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాత టారిఫే ఉంటుందని స్పష్టతనిచ్చింది. ఇప్పటికే పరిపాలన సహా పలు అంశాల్లో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. విద్యుత్తు చార్జీలు పెంచితే అసలుకే మోసం వస్తుందని సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాత టారిఫ్‌నే కొనసాగించాలని నిర్ణయించింది. తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని మంగళవారం ఎర్రగడ్డలోని విద్యుత్తు నియంత్రణ భవన్లో నిర్వహించారు. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, జేఎండీ శ్రీనివాసరావు, టీజీఎన్పీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి హాజరయ్యారు. టీజీఎన్పీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ 2025 -26 సంవత్సరంలో చార్జీలు పెంచబోమని ఈ సమావేశంలో ప్రకటించారు.
విద్యుత్తుషాక్ మరణాలకు పరిహారాన్ని రూ.15 లక్షలకు పెంచాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల శశిధర్‌రెడ్డి ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసిన నెల రోజుల్లోనే ట్రాన్స్ఫార్మర్లు బిగించాలని, మోటార్లకు, ఫీడర్లకు మీటర్లు పెట్టవద్దని కోరారు. మెదక్‌లో విద్యుత్తు ఉపకరణాలు సరఫరా చేసే స్టోర్స్‌ను నెలకొల్పాలని పట్లోళ్ల శశిధర్‌రెడ్డి కోరారు.
రైతులు, ఇతర రంగాలకు ఉచిత విద్యుత్తుకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు కోడూరి ప్రకాశ్ సమావేశంలో డిమాండ్ చేశారు. నష్టాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలివ్వాలని కోరారు. సబ్స్టేషన్లు, జనరేటింగ్ స్టేషన్లల్లో సిబ్బంది లేమి సమస్యగా మారిందని, వెంటనే జూనియర్ లైన్మెన్ సహా ఇతర పోస్టులను రిక్రూట్ చేయాలని అన్నారు. ప్రతి నెలా ఉద్యోగులకు 5వ తేదీన జీతాలిస్తున్నారని, ఒకటో తేదీన సూచించారు.