హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పేదల వైద్యం పట్టడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచిత వైద్య పరీక్షలను అందించేందుకు 2018లో కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన ‘టీ-డయాగ్నోస్టిక్స్’పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు నిదర్శనమని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలలో పరీక్షలు అందుబాటులో లేక.. ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లి, వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వైద్యపరీక్షల పరికరాల నిర్వహణకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని తెలుస్తున్నది.
టీ డయాగ్నోస్టిక్స్ పథకం చాలా జిల్లాల్లో అధ్వానంగా ఉందని వైద్యశాఖలోనే చర్చ జరుగుతున్నది. పరీక్షలు చేసే యంత్ర పరికరాల నిర్వహణకు కావాల్సిన రసాయనాల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని తెలుస్తున్నది. వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో కలెక్టర్లు తమ అత్యవరసర నిధి నుంచి కెమికల్స్ తెప్పించుకునే పరిస్థితి నెలకొన్నదని అధికారులు వాపోతున్నారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో 80 రకాల పరీక్షలు మాత్రమే చేస్తున్నారు.
సూర్యాపేటలో థైరాయిడ్, ఎలక్టోలైట్స్, గ్రూపింగ్ కిట్స్, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, గుండె పరీక్షలు, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు అందుబాటులోలేవని అధికారులు వివరిస్తున్నారు. సిద్దిపేటలో బయోకెమిస్ట్రీ కెమికల్ లేకపోవడంతో జూన్‌లో సాధారణ వైద్య పరీక్షలు కూడా నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో థైరాయిడ్ ప్రొఫైల్ టెస్టులకు వాడే కెమికల్ అందుబాటులో లేదు. అదిలాబాద్ నుంచి కెమికల్ తీసుకువచ్చి వారానికోసారి పరీక్షలు చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రధాన హబ్‌గా టీ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటు చేసింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. నారాయణపేట, మేడ్చల్ మల్కాజిగిరి మినహా అన్ని జిల్లాల్లో 32 మైక్రోబయోలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్‌తో కూడిన హబ్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, కమ్యూనిటీ సెంటర్లలో 1,546 చోట్ల స్పోక్స్(చిన్న కేంద్రాలు)ను నెలకొల్పింది. ఫలితాలు వెంటనే వచ్చే టెస్టులను స్పోక్స్‌లలో, ఫలితాలకు సమయం పట్టే పరీక్షలను హబ్‌లలో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. షుగర్ నుంచి క్యాన్సర్ వరకు 134 రకాల పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు అప్పుడు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపారు.
డయాగ్నోస్టిక్స్‌కు సంబంధించి వేర్వేరు మిషన్లకు వేర్వేరు రీఏజెంట్స్(రసాయనాలు) వాడుతాం. అయితే 9 జిల్లాలకు సంబంధించి రీ ఏజెంట్స్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గత వారం టీజీఎస్ఎంఐడీసీలో జరిగిన సమావేశంలో రీఏజెంట్ల టెండర్ల ప్రక్రియ చేపట్టాం. త్వరలోనే జిల్లాలకు రసాయనాలు సరఫరా చేస్తాం.
-సంగీత సత్యనారాయణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్
కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఇంపోర్టెడ్ రీ ఏజెంట్స్ కొరత ఉంది. మేము రెగ్యులర్ గా సప్లై చేసే కంపెనీ నుంచి రీ ఏజెంట్స్ రావడం లేదు. దీంతో వేరే కంపెనీ నుంచి రీఏజెంట్స్ తెప్పిస్తున్నాం. వచ్చిన రీఏజెంట్స్ ని ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాము. డయాగ్నోస్టిక్స్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ చంద్రశేఖర్, డయాగ్నోస్టిక్స్ జీఎం