TGS RTC | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణించవద్దని టీజీఎస్ ఆర్టీసీ ఆదేశించింది. ‘స్టాఫ్ నాట్ అలోడ్’ అనే స్టిక్కర్లు అంటించింది. ‘మహిళలు, పాత్రికేయులకు, బడి పిల్లలకు, ఎస్కార్ట్ పోలీసులకు, స్వాతంత్ర సమరయోధులకు, ఎయిడ్స్, డయాలసిస్ పేషంట్లకు, పోలీస్ అమరవీరుల సతీమణులకు, ఎసార్ట్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది. అనేక మందికి 50 శాతం రాయితీలు ఆర్టీసీ యాజమాన్యం కల్పిస్తున్నది. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం ఉచిత రవాణా సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం’ అని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ సర్వీసుల్లో ఆర్టీసీ సిబ్బందికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకపోవడం సరికాదని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌రెడ్డి మండిపడ్డారు. ఈ అంశంపై ఆర్టీసీ పునః పరిశీలించాలని సూచించారు.
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ !
హైదరాబాద్, సెప్టెంబర్28 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తున్నది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో తగిన సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీని నియమించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా కమిటీ శనివారం సచివాలయంలో మరోసారి భేటీ అయ్యింది. పంజాబ్, హర్యానా, తమిళనాడు సర్కార్లు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ అంశంపై చర్చించి, అదే తరహాలో రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. 2011 జనాభా లెకలనే పరిగణనలోకి తీసుకోవాలని సమాలోచనలు చేసినట్టు సమాచారం. 1999 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో ఉపకులలాలకు ఏ మేరకు లబ్ధి జరిగిందనే అంశపై కూడా చర్చించిననట్టు తెలిసింది. ఈ మొత్తం అంశాలపై చర్చించేందుకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కావాలని ఉపసంఘం నిర్ణయించినట్టు సమాచారం.