హైదరాబాద్, జూలై 7 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులను సర్కారు భారీగా పెంచింది. ఒకేసారి విద్యార్థులపై రూ.25వేల భారం మోపింది. రూ.14,900 ఉన్న ఫీజు చాలా కాలేజీల్లో రూ.39 వేలకు చేరింది. ఫీజును పెంచుతూ 2024 అక్టోబర్‌లోనే సర్కారు జీవో విడుదల చేసింది. ఈ భారం బీసీ, ఓసీ విద్యార్థులపైనే పడనున్నది. అయితే, ఫీజులు పెంచిన విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు మరిచిపోయారు. పాలిసెట్ పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించారు.
సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ సైతం నిర్వహించారు. మొదటి వెబ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపునకు ముందు ఫీజులు పెంచిన విషయాన్ని గుర్తించారు. సర్కారు స్పష్టత కోరడంతో ఈ విషయం ప్రభుత్వానికి, అక్కడి నుంచి ఆర్థికశాఖకు చేరింది. ఇంకా ఆర్థికశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. దీంతో పాలిసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు సందిగ్ధంలో పడింది. దీంతో విద్యాశాఖ ఎంత పటిష్టంగా పనిచేస్తున్నదో, ఎంత ముందుచూపుతో వ్యవహరిస్తున్నదో అనేందుకు ఇదే నిదర్శనం. 2024 అక్టోబర్‌లో జీవో జారీచేస్తే అధికారులు ఇంతకాలం ఏం చేశారు? ముందే ఆర్థికశాఖ ఆమోదం ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పాలిసెట్ సీట్ల కన్వీనర్ కోటా ఫీజు రూ.14,900 ఉన్నది. ఈ కోర్సులో చేరిన వారికి మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేందుకు సర్కారు ఆమోదం ఉన్నది. తాజాగా ఫీజు రూ.39 వేలకు పెరిగింది. కానీ, పెరిగిన మొత్తానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేందుకు ఆర్థికశాఖ ఆమోదం లేదు. సీట్ల కేటాయింపు తర్వాత జారీచేసే అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఇస్తారు? విద్యార్థులు ఎంత చెల్లించాలన్నది స్పష్టంచేయాలి.
ఈ తరుణంలో పాత ఫీజు రూ.14,900 పరిగణలోకి తీసుకోవాలా? లేక రూ.39 వేలను పరిగణలోకి తీసుకోవాలా? అన్న సందేహం అధికారుల్లో నెలకొన్నది. ఇదే విషయాన్ని అధికారులు విద్యాశాఖ సహా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఫీజు పెంపుతో సర్కారుపై ఈ ఏడాది రూ.25కోట్లు, వచ్చే ఏడాది రూ.50కోట్లు, ఆ తర్వాత రూ.75కోట్ల భారం పడనున్నది. ఆ తర్వాత మళ్లీ ఫీజులు పెంచాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సూచనల మేరకు కొన్ని ప్రతిపాదనలను ఆర్థికశాఖకు పంపించారు. ఫీజుల విషయంలో స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. ఆ తర్వాతే పాలిసెట్ మొదటి విడుత సీట్లను కేటాయిస్తారు.