హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యాన్ని కేటాయించబోమని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై ఏర్పాటైన సబ్ కమిటీ బుధవారం రెండోసారి సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు మాట్లాడుతూ.. డిఫాల్ట్ మిల్లర్లు బకాయి ఉన్న మొత్తం బియ్యాన్ని త్వరగా ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. డిఫాల్ట్ మిల్లర్ల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, కార్యదర్శి రఘునందన్‌రావు, సివిల్ సైప్లె కమిషనర్ చౌహాన్, జీఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే అగ్నిగుండం ; జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
కాచిగూడ, అక్టోబర్ 16: బీసీ రిజర్వేషన్ల సంఖ్యను పెంచకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం హెచ్చరించారు. హైదరాబాద్‌లోని అభినందన్ హోటల్లో బుధవారం బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల సంఖ్యను పెంచకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీ నేత ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఆమరణ దీక్షకు దిగుతామని స్పష్టం చేశారు. కులగణన చేపట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నందగోపాల్, ఉదయ్‌నేత, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంసీఆర్హెచ్ఆర్డీలో రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్
హైదరాబాద్, అక్టోబరు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం క్రిష్ణా హాస్టల్‌ను కేటాయించింది. ఇక్కడి నుంచి అప్పిలేట్ ట్రిబ్యునల్ కార్యకలాపాలు సాగనున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం అప్పిలేట్ ట్రిబ్యునల్ సమావేశం చైర్పర్సన్ జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ట్రిబ్యునల్ సభ్యులు ప్రదీప్ కుమార్‌రెడ్డి, చిత్రారామచంద్రన్, రెరా చైర్మన్ ఎన్.సత్యనారాయణ పాల్గొన్నారు. రెరా ఇచ్చిన తీర్పులపై వచ్చిన అప్పీల్స్‌పై విచారణ ప్రారంభిస్తామని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.