హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఎదుర్కొన్న చేదు అనుభవంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపిందని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్ తెలిపారు. ఆమెపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని వివరించారు. మిస్ వరల్డ్ నిర్వాహకులు మిల్లాపై లండన్‌లో కేసు వేసినట్టు చెప్పారు. ఆమెపై యూకే ప్రభుత్వమే చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. మిస్ వరల్డ్ పోటీల సమయంలో పోటీదారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరుపై మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.
ఆమె చేసిన ఆరోపణలపై వేసిన కమిటీ దర్యాప్తులో భాగంగా బాధితురాలి వివరణనూ తీసుకోవాల్సి ఉంటుంది. మిల్లా మ్యాగీ ఎదుర్కొన్న భయానక పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకొని అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దర్యాప్తు పూర్తయిందని, 109 మంది పోటీదారులు ఎలాంటి వేధింపులనూ ఎదుర్కోలేదని కమిటీ తేల్చేసినట్టు జయేశ్‌రంజన్ ప్రకటించడం గమనార్హం. అయితే వారు పోటీలు ముగిశాక.. తమ స్వదేశాలకు వెళ్లిన తరువాత ఎలా స్పందిస్తారోననే భయం నిర్వాహకులను వెంటాడుతున్నది. ఈ దశలోనే మిస్ ఇంగ్లండ్‌పై మిస్ వరల్డ్ నిర్వాహకులు కేసు వేసేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. కాగా ఈ కేసును మిస్ ఇంగ్లాండ్ ఎలా ఎదుర్కోబోతుందో వేచి చూడాలి.