హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): నేషనల్ పెన్షన్ స్కీమ్‌లోని సొమ్ములు రాష్ర్టాలకు వెనక్కి ఇవ్వబోమన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనపై నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎవడబ్బ సొమ్మని కేంద్రం పింఛన్ సొమ్ములను వెనక్కి ఇవ్వనంటున్నదని ప్రశ్నించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఎన్‌ఎంవోపీఎస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో స్థితప్రజ్ఞ మాట్లాడారు. జాతీయ పింఛన్ పథకంలో వ్యక్తిగత చందాదారులు ఉద్యోగులైతే.. ఉద్యోగులు దాచుకున్న డబ్బును వెనక్కి తీసుకోవడానికి చట్టం అనుమతించదన్న కేంద్ర మంత్రి మాటలను ఖండించారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ రాష్ట్రాలపై బెదిరింపు చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కల్వల్ శ్రీకాంత్, నరేశ్‌గౌడ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.