హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : మీరు ఇంటర్‌ను బయాలజీ సబ్జెక్టు లేకుండా పూర్తిచేశారా.. నీట్ యూజీ రాయాలన్న.. డాక్టర్ కావాలన్న మీ కల నెరవేరలేదా.. అయితే నో టెన్షన్. ఇక నుంచి ఇంటర్లో బయాలజీ చదవని విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రత్యామ్నాయంగా మరో అవకాశం ఇచ్చింది. ఇలాంటి విద్యార్థులు అదనపు సబ్జెక్టుగా బయాలజీని చదివి.. నీట్ యూజీకి హాజరుకావొచ్చని నేషనల్ మెడికల్ కమిషన్ తెలిపింది. ఈ మేరకు గురువారం తన వెబ్సైట్లో సర్క్యులర్‌ను పొందుపరిచింది.
ఇటీవలి కాలంలో 10 ప్లస్ టూ విద్యలో అనేక సబ్జెక్టు కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బయెటెక్నాలజీ ఇతర సబ్జెక్టులను విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇలాంటి వారికి నీట్ యూజీ రాసేందుకు అవకాశం లేదు. దీంతో ఎంబీబీఎస్ చదువుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా విద్యార్థుల కోసం ఎన్ఎంసీ ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నది. గతంలో తిరస్కరించిన నీట్ దరఖాస్తులకు ఇది వర్తిస్తుందని ఎన్ఎంసీ పేర్కొన్నది.