బంజారాహిల్స్, ఫిబ్రవరి 24: తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని హైదరాబాద్ ఏడో నిజాం మిర్ ఉస్మాన్ అలీఖాన్ ముని మనవడు ప్రిన్స్ మొజంజా బహదూర్ మనుమడు హిమాయత్ అలీ మిర్జా ప్రశంసించారు. ప్రపంచ ప్రసిద్ధిచెందిన నిజాం ఆభరణాలను ప్రదర్శించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక మ్యూజియం నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు లేఖ రాసినట్టు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని మషెల్లా మంజిల్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అలుపెరుగని పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్, అదే స్ఫూర్తితో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. కొత్త సచివాలయ నిర్మాణం, మొజంజాహీ మార్కెట్ సుందరీకరణ, చార్మినార్, ట్యాంక్‌బండ్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఆలయాల నిర్మాణం తదితర పనులతో తెలంగాణ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించేందుకు సీఎం విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఏడో నిజాం మిర్ ఉస్మాన్ అలీఖాన్‌కు చెందిన అరుదైన ఆభరణాలను హైదరాబాద్‌లోనే శాశ్వతంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.217 కోట్ల విలువైన ఈ ఆభరణాలు హైదరాబాద్ నగరానికే మణిహారంగా ఉంటాయని, వాటిని భద్రపరిచేందుకు మ్యూజియం ఏర్పాటుచేయాలని విన్నవించారు. మ్యూజియం ఏర్పాటుచేస్తే నిజాం ఆభరణాలను శాశ్వతంగా హైదరాబాద్‌లోనే ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. నిజాంకు చెందిన 2 వేల ఎకరాల భూమి నగరంలోని పలు ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్నదని, ఆ స్థలాలను గుర్తించడంలో తాను ప్రభుత్వానికి సహకరిస్తానని చెప్పారు. ఆ స్థలాల్లోనే మ్యూజియం నిర్మించాలని 17న సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్టు వెల్లడించారు.