Cantonment By Election | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా గైని నివేదితను పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రకటించారు. నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చిం చి, అందరి ఏకాభిప్రాయంతో ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారుచేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణాంతరం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నది.
లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి పోటీకి కొంతమంది ఆసక్తి చూపినా సాయన్న కు టుంబానికి అండగా నిలబడాలన్న లక్ష్యం తో నివేదితకు టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు కేసీఆర్‌కు నివేదిత కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తన తల్లి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తదితరులతో కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.