నల్లగొండ : బంగారు తెలంగాణ సాధన కోసం పరితపిస్తూ, అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఓ విద్యార్థిని ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. 100కు పైగా కేసీఆర్ చిత్రాలను గీసి.. ఆయనపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది ఆ అమ్మాయి.
నల్లగొండ జిల్లా పద్మావతి కాలనీకి చెందిన గుర్రం మేఘన(9) ఐదో తరగతి చదువుతోంది. ఆమెకు డ్రాయింగ్ అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలో మేఘనను తండ్రి వెంకటేష్ ప్రోత్సహించారు. తండ్రి ప్రోత్సాహంతో.. మేఘన డ్రాయింగ్‌పై మరింత దృష్టి సారించింది. మేఘనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అభిమానం. దీంతో 100కు పైగా కేసీఆర్ చిత్రాలను వివిధ రంగులతో డ్రాయింగ్ వేశారు. మేఘన గీసిన ప్రతి చిత్రం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఉంటుంది. తెలంగాణకు హరితహారం అనే పథకంపైనే ఆమె 20కి పైగా చిత్రాలు గీసింది.
ఇక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బర్త్‌డేను పురస్కరించుకొని.. మేఘన వినూత్నంగా ఆలోచించారు. రావి ఆకుపై 14 సంక్షేమ పథకాలతో కేసీఆర్ చిత్రంతో అద్భుతమైన పెయింటింగ్ వేశారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై చిత్రాలు గీసినప్పుడు తనను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మెచ్చుకుని, ప్రశంసలు కురిపించారని మేఘన తెలిపింది. కేసీఆర్ తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడు అని మేఘన చెప్పింది. తమ కుమార్తెకు డ్రాయింగ్‌పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడంతో.. ఆమెకు మరిన్ని మెలకువలు నేర్పించి, ప్రోత్సహించినట్లు మేఘన తండ్రి వెంకటేశ్ పేర్కొన్నాడు. రెండేండ్ల వయసు నుంచే ఆమె పెన్సిల్‌తో డ్రాయింగ్ వేయడం మొదలుపెట్టిందని తెలిపాడు. మేఘన ఆర్ట్‌కు 2021 సంవత్సరంలో ఇంటర్నేషనల్ జై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. 2019 ఏడాదిలో తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మేఘన డ్రాయింగ్స్‌ను ప్రదర్శించారు.