హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ) : కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. నిమ్స్ యూరాలజీ విభాగం ఈ నెలలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో 2,000 మైలురాయిని దాటింది. దేశంలోని ప్రభుత్వ వైద్యరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వేలాది మంది రోగులకు ఈ కార్యక్రమం ఆశాకిరణంగా మారింది. బొక్కల దవాఖానగా పేరున్న నిమ్స్‌లో 1989లో తొలిసారిగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించారు. 1989 నుంచి 2010 వరకు 21 సంవత్సరాలలో 448 కిడ్నీ మార్పిళ్లలో నిర్వహించిన నిమ్స్ వైద్యులు, 2011 నుంచి 2017 జూన్ వరకు ఆరేండ్లలో 552 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు పూర్తి చేశారు. 2017 జూన్ నుంచి 2023 జనవరి వరకు మరో 500 శస్త్రచికిత్సలు నిర్వహించగా, 2023 ఫిబ్రవరి నుంచి 2026 మే వరకు కేవలం మూడేండ్ల నాలుగు నెలల్లోనే 500 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించారు.
గడిచిన మూడున్నరేండ్లలో నిర్వహించిన 500 కిడ్నీ మార్పిళ్లలో ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం విజయవంతంగా నిర్వహించినట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్దేవరాజ్ తెలిపారు. ఇందులో ముఖ్యంగా బహుళ రక్తనాళాలతో కూడిన క్లిష్ట మార్పిడులు, చిన్నారుల కిడ్నీ మార్పిడులు, గతంలో విఫలమైన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ను రెండవసారి నిర్వహించడం వంటి అరుదైన ఆపరేషన్లు ఉన్నట్టు వివరించారు.

శస్త్రచికిత్సలను విజయవంతంగా చేయడమే కాకుండా కిడ్నీ మార్పిడి అనంతర ఫలితాలు కూడా అత్యుత్తమంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్లలో ఒక సంవత్సరం తర్వాత గ్రాఫ్ట్ సర్వైవల్ రేటు 95 శాతానికి పైగా ఉండగా, మూడేండ్ల తర్వాత 90 శాతం, ఐదేండ్ల తర్వాత 85 శాతంగా నమోదయినట్టు వైద్యులు వెల్లడించారు. కడావర్ ట్రాన్స్ప్లాంట్లలో కూడా ఒక సంవత్సరం తర్వాత 90 శాతానికి పైగా సక్సెస్ రేటు నమోదయినట్టు వైద్యులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా 2025లో ప్రభుత్వ దవాఖానల్లో రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన ఘనతను సైతం నిమ్స్ వైద్యులు సొంతం చేసుకున్నారు. నిమ్స్ యూరాలజీ విభాగం కేవలం కిడ్నీ మార్పిళ్లకే పరిమితం కాకుండా ప్రతి ఏడాదీ సుమారు 11 వేల యూరాలజీ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్టు డా.రాహుల్ దేవరాజ్ తెలిపారు. గడిచిన మూడేండ్లలో 500కు పైగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించినట్టు చెప్పారు.
నిమ్స్‌లో నిర్వహించిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో 95 శాతం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా నిర్వహించినట్టు నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప వెల్లడించారు. రెండు వేల కిడ్నీ మార్పిళ్లలో 1,900 పైగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారేనని, వీరిలో 95 శాతం మంది ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పూర్తిగా ఉచిత వైద్యసేవలు పొందారని డైరెక్టర్ వెల్లడించారు. యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రాంరెడ్డి సహా పలువురు వైద్యులు, నెఫ్రాలజీ, అనస్తీషియా, రేడియాలజీ, పాథాలజీ విభాగాల నిపుణులు, నర్సింగ్ సిబ్బంది కీలకపాత్ర పోషించారు. రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తిచేసిన సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్పతో పాటు యూరాలజీ విభాగాధిపతి డా.రాహుల్ దేవరాజ్, ఆయన బృందాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.