ఖైరతాబాద్, ఫిబ్రవరి 22: ప్రమాదంలో వెన్నుపూస విరిగి వీల్‌చైర్‌కే పరిమితమైన ఓ వ్యక్తికి హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖాన వైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. నగరానికి చెందిన అంజయ్య (42)కు రెండున్నర సంవత్సరాల క్రితం ఓ ప్రమాదంలో వెన్నుపూస విరిగిపోయింది. కుటుంబసభ్యులు నిమ్స్ దవాఖానకు తరలించగా.. వైద్యులు వెన్నులో రాడ్లు, స్క్రూలను అమర్చారు. కానీ ప్రమాదం జరిగిన నాటి నుంచి ఆయన రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో అతడు వీల్ చైర్‌కే పరిమితమయ్యాడు.
తీవ్ర నొప్పితోపాటు కదలడానికి కూడా ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు అతడిని మళ్లీ నిమ్స్ దవాఖానలో చేర్పించారు. వివిధ పరీక్షలు నిర్వహించిన న్యూరోసర్జరీ వైద్యులు స్పైనల్ కార్డ్ స్టిములేటర్ పరికరాన్ని అమర్చాలని నిర్ణయించారు. న్యూరోసర్జన్లు ప్రొఫెసర్ సుచందా భట్టాచార్జి, డాక్టర్ రామనాథరెడ్డి, డాక్టర్ స్వప్న, డాక్టర్ అవినాశ్లీ బృందం శస్తచ్రికిత్స నిర్వహించి స్పైనల్ కార్డ్ స్టిములేటర్ పరికరాన్ని విజయవంతంగా అమర్చారు.
ఈ చికిత్స ద్వారా చచ్చుబడిన కాళ్లలో చలనం రావడంతోపాటు నొప్పి బాధలు తగ్గుతాయని వైద్యులు తెలిపారు. తమ న్యూరో సర్జరీ విభాగం ఈ తరహా శస్తచ్రికిత్సను రాష్ట్రంలోనే తొలిసారి నిర్వహించినట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.