BC Welfare | హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ): ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లైబ్రేరియన్లకు సైతం నైట్‌డ్యూటీలు విధించాలని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నిర్ణయించింది. సొసైటీ కార్యదర్శి సైదులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై సొసైటీ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇటీవల ఎస్సెస్సీ, ఇంటర్లో చాలా బీసీ గురుకులాల్లో 100% ఉత్తీర్ణత నమోదు కాలేదు.
దీనిపై సెక్రటరీ రివ్యూ చేయగా నైట్‌డ్యూటీల వల్లే 100% ఉత్తీర్ణత రాలేదని టీచింగ్ స్టాఫ్ నివేదించినట్టు తెలిసింది. టీచింగ్ స్టాఫ్‌తోపాటు ఆర్ట్‌క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్లకు సైతం నైట్‌డ్యూటీలు విధించాలని నిర్ణయించినట్టు సమాచారం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వారికి వార్డెన్ డ్యూటీలు వేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయంపై ఆర్ట్‌క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్ టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు, నిర్దేశించిన విధులు పూర్తిభిన్నమని, ప్రమోషన్లు కూడా తమకు లేవని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని సెక్రటరీకి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు పునరాలోచించాలని, సరైన న్యాయం చేయాలని లైబ్రేరియన్లు, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.