హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : విజయనగరంలో వెలుగుచూసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా 8 రాష్ర్టాల్లో మంగళవారం సోదాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, యూపీ, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్రలో 16 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మరిన్ని అరెస్టులు తప్పవని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.
కొత్తగూడెం: ఎన్ఐఏ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో గల ఓ ఇంట్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓ యువకుడికి సంబంధించిన ల్యాప్‌టాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.