హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఎన్ఐఏ, పోలీసు కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు సిరాజ్, సమీర్ దర్యాప్తు అధికారులకు దురుసుగా సమాధానం ఇస్తున్నట్టు తెలిసింది. ‘మీరు ఇంకా నాలుగు రోజులు ఆగి ఉంటే.. నా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది’ అని కాలుపై కాలువేసుకొని సిరాజ్ పొగరుగా సమాధానం ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. గతంలోనే హైదరాబాద్‌లో మకాం వేసిన సిరాజ్, సమీర్ కలిసి ఐదు చోట్ల రెకీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో సైతం వారు రెకీ నిర్వహించినట్టు తెలిపింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు వరంగల్‌కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల వారితో జరిగిన సమావేశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా.. సిరాజ్ కౌంటర్‌ను మెచ్చుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎన్ఐఏ అధికారులకు వీరిద్దరూ కొంచెం దురుసుగానే సమాధానం ఇస్తున్నట్టు తెలిసింది. కాగా, రెండో రోజు విచారణలో కొన్ని కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం.