NIA Charge Sheet | హైదరాబాద్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టులో దుమ్ముగూడెం కుట్ర కేసులో ఏడుగురు మావోయిస్టులపై ఎన్ఐఏ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఐపీసీలోని 120బీ, 121 సెక్షన్లు, ఉపాలోని 18,20,23,38,39, 40 సెక్షన్లు, పేలుడు పదార్థాల చట్టంలోని 4,5,6 సెక్షన్లు, ఎక్స్‌ప్లోజివ్ యాక్టులోని 9బీ సెక్షన్ల ప్రకారం వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా వాసి ముత్తు నాగరాజు అలియాస్ ఎం నాగరాజు ప్రధాన నిందితుడిగా, మేడ్చల్ జిల్లా వాసి కొమ్మరాజుల కనుకయ్య అలియాస్ కొమ్మరాజు కనకయ్య, జనగామ జిల్లా వాసి సూర సారయ్య, మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేసన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్ జీఏ) కమాండర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా వాసి మాద్వి హిద్మ అలియాస్ సంతోష్ అలియాస్ హిద్మాలు అలియాస్ ఇడుముల్ అలియాస్ పొడియం, అలియాస్ మనీష్ అలియాస్ మాండవి అలియాస్ హిద్మన్నా అలియాస్ దేవ, భూపాలపల్లి జిల్లా వాసి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి, చర్ల దళం కమిటీ కమాండర్ మడకం కోశి అలియాస్ రజిత, వరంగల్ అర్బన్ జిల్లా వాసి వల్లెపు స్వామిలను నిందితులుగా పేర్కొన్నారు.
ఇంతకుముందు గత ఫిబ్రవరి 18న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. తాజాగా గత మే రెండో తేదీన ఎన్ఐఏ తిరిగి ఈ కేసును రిజిస్టర్ చేసింది. ఇతర కార్యకర్తలతో కలిసి మాద్వి హిద్మ, కొయ్యాడ సాంబయ్య, మడకం కోశి.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారని అభియోగాలు నమోదు చేశారు. భద్రతా బలగాలపై దాడులతోపాటు తీవ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారని పేర్కొన్నారు.