మొయినాబాద్, నవంబర్ 4 : హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా ఉండటం, పెద్దఎత్తున గుంతలు ఏర్పడటంతో తరచూ ప్రమాదాలు జరిగి, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ ప్రజలు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు వినిపించుకోవడంలేదు. సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలవడంతో అధికారులు మొద్దునిద్ర వీడినట్టు కనిపిస్తున్నది.
మంగళవారం జాతీయ రహదారుల సంస్థ అధికారులు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు హైదరాబాద్-బీజాపూర్ రోడ్డుపై గుంతలను పూడ్చే పని మొదలుపెట్టారు. గుంతలను సిమెంట్ కాంక్రీట్‌తో పూడ్చుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు నాలుగు రోజులు హడావుడి చేసే అధికారులు… సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాలయాపన మానుకుని, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.