హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)ని 4 లేన్ల నుంచి 6 లేన్లకు విస్తరించడంతోపాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలన్న విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఈ నెల 15న జరిగే ఫైనాన్స్ మీటింగ్‌లో ఎన్‌హెచ్-65 విస్తరణను ఆమోదిస్తామని, త్వరగా అంచనాలు రూపొందించి పంపితే 2 నెలల్లోగా టెండర్లు పిలుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. మంగళవారం ఆయన ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, బలరాంనాయక్, రఘురామిరెడ్డి, వంశీకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి తదితరులతో కలిసి ఢిల్లీలో గడ్కరీతో సమావేశమయ్యారు. అనంతరం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగానికి ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరడంతోపాటు ఈ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత సాంకేతిక అనుమతులు కూడా రావాల్సి ఉన్నదని గుర్తుచేసినట్టు చెప్పారు.
దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని, అలైన్మెంట్ ప్రతిపాదనలు పంపితే అనుకున్న దానికన్నా ముందే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. చింతల్‌కుంట చెక్‌పోస్ట్ నుంచి హయత్‌నగర్, ఆలిండియా రేడియో స్టేషన్ వరకు దాదాపు 5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతోపాటు నాగ్‌పూర్‌లో మాదిరిగా డబుల్ డెకర్ ఫ్ల్లైఓవర్గా నిర్మాణం చేపట్టాలన్న విజ్ఞప్తికి కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో టైగర్ రిజర్వ్ వద్ద ఎలివేటెడ్ కారిడార్‌ను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్ద పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్-మన్నెగూడ రహదారి పనులను పూర్తిచేస్తామని, సేతు బంధన్, సీఆర్ఐఎఫ్ నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్టు వివరించారు.
తన సోదరుడు రాజ్‌గోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అంశం తన పరిధిలో లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్‌తోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిధిలో ఉన్న ఆ అంశంపై తాను స్పందించలేనని చెప్పారు.