హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): విజయవాడ-నాగ్‌పూర్ సెక్షన్లో గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకున్నది. 300 కిలోమీటర్ల మేర పనుల్ని మేఘా సంస్థ నిర్మించనున్నది. విజయవాడ-నాగ్‌పూర్(ఎన్‌హెచ్-163జీ), హైదరాబాద్-నాగ్‌పూర్(ఎన్‌హెచ్-44) రహదారుల అభివృద్ధిలో భూసేకరణ సమస్యగా మారడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఈ మేరకు బుధవారం రోడ్డుభవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నివాసంలో నిర్వహించిన సమీక్షలో అధికారులు వెల్లడించారు. భూసేకరణలో ఇబ్బందులు లేని, సేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పనులు మొదలుపెట్టాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-మన్నెగూడ రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరిగి, ప్రయాణికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.
పరీక్షల నిర్వహణపై ఇంటర్‌బోర్డ్ అధ్యయనం
హైదరాబాద్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంపై దృష్టిపెట్టిన ఇంటర్‌బోర్డు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విధానాలను అనుసరించాలన్న యోచనలో ఉన్నది. ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షల్లో కమిషన్ అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను ఇంటర్లో అమలు చేసేందుకు అధ్యయనం చేయనున్నది. అందుకోసం ఐదుగురు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది. కాగా, ఇంటర్ వార్షిక పరీక్షలను పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించడంలో భాగంగా ప్రశ్నపత్రాల ముద్రణ, పరీక్షా కేంద్రాలకు చేర్చడం, కాపీయింగ్ నివారణ వంటి అంశాల్లో టీజీపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. టీజీపీఎస్సీ తీసుకుంటున్న జాగ్రత్తలను అనుసరించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో బృందం అధ్యయనం చేయనున్నట్టు సమాచారం.